Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అవి అనారోగ్యంతో ఉన్న కోళ్లని తెలియక ఓ తల్లి వాటితో కూర చేసి తన పిల్లలకు పెట్టి తాను తిన్నది. చికెన్ ను ఎంతో ఇష్టంగా తిన్న ఇద్దరు చిన్నారులకు అది విషంగా మారింది. ఇద్దరు పిల్లలు మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ముగ్గురు ఆ తిన్న చికెన్ ను పిల్లల తండ్రి తినలేదు. దాంతో ఇది అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని తూఫ్రాన్ మండలం వెంకటాయపల్లెలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుల్లె మల్లెశ్, బాలామణి దంపతులు. వారి ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటూ మనోహారబాద్లో ఓ కోళ్ల ఫాంలో పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కోళ్ల ఫాం యజమాని కోళ్లను అమ్మకానికి తీసుకెళ్లాడు. అయితే వాటిలో కొన్ని అనారోగ్యంతో ఉండడంతో వాటిని అక్కడే వదిలేశాడు. ఈ క్రమంలోనే అది తెలియక మల్లెశ్ భార్య బాలామణి సోమవారం రాత్రి అనారోగ్యంతో ఉన్న కోళ్లను కోసి కూర వండింది. అనంతరం మల్లేశ్ మినహా కుమార్తే మనిషా(13), కుమారుడు కుమార్ (10) తో కలిసి తల్లి చికెన్‌తో భోజనం చేశారు. మంగళవారం తెల్లవారు జామున ఇద్దరు పిల్లలు కడుపు నొప్పితో బాధపడ్డారు. దాంతో బాలమణి తన తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో వెంటనే వారిని స్థానిక తూఫ్రాన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి వారిని ప్రయివేటు ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమంగా మారింది. దాంతో తిరిగి తూఫ్రాన్ ఆస్పత్రికే తరలిస్తుండగా పిల్లలిద్దరూ మృతి చెందారు. అనంతరం వారి తల్లి కూడా అనారోగ్యానికి గురైంది. కడుపునొప్పితో వాంతులు చేసుకోవడంతో ఆమెను కూడా తుఫ్రాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాలమణి భర్త మల్లెశ్ మాత్రం ఆ రోజు తన యజమానులు వండుకున్న చికెన్ తిన్నట్టు తెలుస్తోంది. మరి అతను భార్య, పిల్లలు తిన్న చికెన్ ఎందుకు తినలేదనే కోణంలో మల్లెశ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనారోగ్యం పాలైన కోళ్లను పాతిపెట్టకుండా యాజమాని నిర్ణక్ష్యంగా వ్యవహరించాడని ఆరోపణలు వస్తున్నాయి.