Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 18 నెలల్లో కేసీఆర్ను గద్దె దించాలని ఉద్యమకారులు ఆవేశంగా ఉన్నారని ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రావిర్యాలలో ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ బహిరంగ సభ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు కింద ఇచ్చే రూ.10 లక్షలు ఎవరి భిక్షం కాదని.. ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన సొమ్మునే మళ్లీ వాళ్లకు తిరిగి ఇస్తున్నారని తెలిపారు. ఓట్ల అవసరమైతేనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను దెబ్బకొట్టే అవకాశం ప్రజలకు దక్కిందని.. తెలంగాణ 4 కోట్ల ప్రజల భవిష్యత్ ఇప్పుడు హుజూరాబాద్ బిడ్డల చేతిలో ఉందని అన్నారు. కాంగ్రెస్ సభలు చూసి కేసీఆర్ గుండెల్లో గునపం దిగినట్లు ఉందన్నారు.
ప్రణబ్ ముఖర్జి వచ్చినప్పుడు, మాజీ గవర్నర్ నరసింహన్ కనిపించినప్పుడు కేసీఆర్ వాళ్ల కాళ్లు మొక్కుతాడని కానీ దళిత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వచ్చినప్పుడు కనీసం నమస్కారం కూడా చేయలేదు అన్నారు. మొదటి సీఎస్ రాజీవ్ శర్మ, తర్వాత సీఎస్ ఎస్కే జోషి, మొదటి డీజీపీ అనురాగ్ శర్మ ఈ ముగ్గురి పదవులను మూడుసార్లు పొడిగించారని చెప్పారు. ఇప్పుడు వారిని ప్రభుత్వ సలహాదార్లుగా నియమించుకున్నారు కాని ఒక దళిత బిడ్డ ప్రదీప్ చంద్ర సీఎస్ అయితే ఒకటే నెలకు రిటైర్మెంట్ ఇచ్చారన్నారు. ఇదే కేసీఆర్ దళితుల పట్ల ఉన్న గౌరవం అని ప్రశ్నించారు. భూపాలపల్లి కలెక్టర్గా ఉన్న మురళి పేదల గురించి మాట్లాడితే అతన్ని అవమానించారన్నారు. ఆయన రాజీనామా చేసి బయటకు వెళ్లారని తెలిపారు.