Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోటా: ఝార్ఖండ్లో ఓ న్యాయమూర్తిని గత నెలలో ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన సంఘటన మరువకముందే రాజస్థాన్లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బూందీ జిల్లా సెషన్స్ జడ్జి సుధీర్ పారిక్ను చంపేస్తానంటూ ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ రాశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు..న్యాయమూర్తికి భద్రత పెంచారు. హిందీలో రాసిన ఆ లేఖలో జడ్జికి ఆగంతుకుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. జడ్జి వల్ల తమకు న్యాయం జరుగుతుందన్న భరోసా లేదని, అందుకే మాఫియా సాయంతో హత్యకు ప్రణాళిక రచించినట్లు తెలిపాడు. ‘‘మీ వల్ల న్యాయం జరుగుతుందని ఆశ లేదు. అందుకే మిమ్మల్ని సెప్టెంబర్ 13న హత్య చేస్తున్నాం’’ అని లేఖలో చెప్పాడు. ‘‘మీ ఇంటిని బాంబులతో పేల్చివేద్దామనుకున్నాం. కానీ మీ కుటుంబసభ్యులు మాకు ఎలాంటి హాని చేయలేదు. అందుకే వెనక్కి తగ్గాం. మిమ్మల్ని తుపాకీతో కాల్చి లేదా విషమిచ్చి, వాహనంతో ఢీకొట్టి.. ఎలాగైనా చంపేస్తాం. న్యాయస్థానంలో నిందితుడికి మీరు ఎలా అవకాశమిస్తారో, మేమూ రక్షించుకోవడానికి మీకో అవకాశమిస్తున్నాం. ఈ హత్య గురించి పోలీసులకూ సమాచారమిచ్చాం’’ అని లేఖలో ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.