Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: తాలిబన్ల వశమైన అఫ్గనిస్తాన్‌కు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. అల్లకల్లోలంగా మారిన ఆ దేశానికి ఆయుధాల అమ్మకాలను నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అఫ్గనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి రావడంతో బైడెన్ పాలనా యంత్రాంగం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ రాజకీయ, సైనిక వ్యవహారాల బ్యూరో రక్షణ కాంట్రాక్టర్లకు సమాచారం అందించింది. కాగా, ఆఫ్గనిస్తాన్‌లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పతనం తరువాత అమెరికాకు చెందిన బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాలిబన్లు తమతో జరిగిన ఒప్పందానికి తూట్లు పొడిచి రక్షణ సామాగ్రిని స్వాధీనం చేసుకుందని అగ్రరాజ్యం గర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో తాలిబన్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో బైడెన్ ప్రభుత్వం అఫ్గానిస్తాన్‌కు ఆయుధాల అమ్మకాలను పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అమెరికా ఆయుధ భాండాగారంలో బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, ఏ-29 సూపర్ టుకానో అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, మైన్ రెసిస్టెంట్ హమ్వీస్‌తో పాటు ఎం4 కార్బైన్లు, ఎం 6 రైఫిల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, 2020 వరకు అమెరికా అఫ్గాన్‌కు 227 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.