Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తమిళనాడులోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 13 మంది విద్యార్థులకు కరోనా సోకింది. సేలం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఇది వెలుగు చూసింది. కాలేజ్‌ను తెరిచిన కొన్ని రోజుల్లోనే పదుల సంఖ్యలో విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. తమిళనాడులోని అన్ని వైద్య, నర్సింగ్ కళాశాలలను సోమవారం నుంచి తెరువాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సేలంలోని ప్రభుత్వ మోహన్ కుమారమంగళం మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న మూడవ ఏడాది నర్సింగ్ విద్యార్థికి క్లాసులు తిరిగి ప్రారంభమైన ఒక రోజు తర్వాత జ్వరం వచ్చింది. ఆమెకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో తరగతిలోని మిగతా 19 మంది విద్యార్థులకు కరోనా టెస్ట్ చేయగా పది మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో ఇద్దరు తొలి ఏడాది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా సోకిన నర్సింగ్ విద్యార్థులను సేలం ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ నర్సింగ్ కాలేజ్‌లో చదువుతున్న 176 మంది విద్యార్థులకు గత రెండు రోజులుగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.