Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డను ఓ తల్లి చెత్తకుప్పలో పారేసింది. ముళ్లకంపలో పడిన ఆ చిన్నారి ఒళ్లంతా రక్తసిక్తమై ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని గుర్తించిన మున్సిపల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే ఓ బాలికే ఆ బాబుకు జన్మనివ్వడంతో బాలిక తల్లిదండ్రులు శిశువును పారేసి వెళ్లిపోయారని ఆరోపణలు వస్తున్నాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ రెండో సంవత్సరం చుదువుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఓ అబ్బాయిని ప్రేమించింది. పెండ్లి చేసుకుంటాననే ఉద్దేశంతో అతనికి శారీరకంగా దగ్గరైంది. బాలిక కొంత కాలంగా తరచూ అనారోగ్యానికి గురవడంతో.. తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమె గర్భవతని చెప్పడంతో తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ఎలాగైనా సరే తమ బిడ్డకు గర్భస్రావం చేయమని బతిమాలారు. అప్పటికే నెలల నిండడంతో... గర్భస్రావం చేయడం కుదరదని వైద్యులు తేల్చి చెప్పారు.
ఇక చేసేదేం లేక బాలికను తీసుకొని ఇంటికెళ్లిపోయారు. విషయం తెలిస్తే.. అందరి ముందు పరువు పోతుందని భావించిన ఆ తల్లిదండ్రులు... బాలిక కడుపులో కణతి అయిందని చెప్పారు. అందువల్లే కడుపు పెరుగుతుందని వివరించారు. నిన్న రాత్రి పురిటి నొప్పులు రావడంతో... నిజామాబాద్ ఖలీల్వాడిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. శనివారం ఉదయం ఆ బాలిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు పుట్టిన వెంటనే..ఆమె తల్లిదండ్రులు ఏ మాత్రం దయాహృదయం లేకుండా అతన్ని స్థానికంగా ఉన్న చెత్తకుప్పలో పడేసి పారిపోయారు.
ప్రాణాలు కోల్పోయిన శిశువు
వారు విసిరిన బాబు ముళ్లకంపపై పడడంతో... ఒళ్లంతా గాయలయ్యాయి. లేత శరీరంలోకి ముళ్లు గునపాల్లా దిగాయి. ఆ చిన్నారి ఆయువును తీసేశాయి. విషయం గుర్తించిన మున్సిపల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాబు స్థానిక ఆస్పత్రిలోనే జన్మించినట్టు పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ఇందుకు సంబంధించి శిశువు తల్లిని, ఆమె తల్లిదండ్రులను విచారించారు. తమకేం తెలీదని.. ఆ బాబు తమ బాబు కాడంటూ వారు చెప్పడంతో... సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.