Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహారాష్ర్ట సీఎం ఉద్ధవ్ థాక్రేపై కేంద్రమంత్రి నారాయణ్ రాణె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన సోమవారం రాత్రే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నాసిక్ పోలీసులు ఇప్పుడు రాణెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మంత్రి కొంకణ్ ప్రాంతంలోని చిప్లున్‌లో ఉండటంతో నాసిక్ పోలీసులు అక్కడి వెళ్లారు. నాసిక్ పోలీస్ కమిషనర్ దీపక్ పాండే మాట్లాడుతూ 'ఇది చాలా తీవ్రమైన అంశం. ఇప్పటికే కేంద్ర మంత్రిపై తగిన చర్యలు తీసుకోవడానికి ఓ బృందం వెళ్లింది. ఆయన ఎక్కడుంటే అక్కడ కోర్టులో హాజరు పరుస్తాం. కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తాం`అని కమిషనర్ అన్నారు.
మరో వైపు కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో ఇప్పుడు బీజేపీ, శివసేన మధ్య మళ్లీ వివాదం మొదలైంది. నాసిక్‌లో శివసేన కార్యకర్తలు.. బీజేపీ ఆఫీస్‌పై రాళ్ల దాడి చేయగా, ముంబైలో రెండు పార్టీల వాళ్లు గొడవకు దిగారు. శివసేన ఎంపీ వినాయక్ రౌత్ కూడా మంత్రి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకత్వాన్ని ఆకట్టుకోవడానికి రాణే.. శివసేన లీడర్లను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. మోడీ మంత్రి వర్గంలోకి ఆయన వెళ్లాకా మానసిక సమతూల్యత కోల్పోయాడన్నారు. మోడీ అతన్ని మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అసలేమైందంటే..
రాయ్‌గఢ్ జిల్లాలో సోమవారం నారాయణ్ రాణె జన్ ఆశీర్వాద్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం ఏ ఏడాది వచ్చిందో ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గు చేటు అన్నారు. స్వాతంత్ర్యం ఏ ఏడాదిలో వచ్చిందో తెలియని ఉద్ధవ్ థాక్రేను తాను కొడదామనుకున్నా అని అన్నారు. ఈ వ్యాఖ్యలను శివసేన తీవ్రంగా ఖండించింది.