Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై కేంద్రమంత్రి నారాయణ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎంకు స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. ఇందుకు ఠాక్రే చెంప పగలగొట్టాలని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై శివసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే..జన ఆశీర్వాద యాత్రలో సందర్భంగా రాణే రాయ్‌గఢ్ జిల్లాలో పర్యటించారు. అక్కడ ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న ఠాక్రే చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. 'ముఖ్యమంత్రికి స్వాత్రంత్యం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు. స్వాత్రంత్య దినోత్సవం నాడు రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఠాక్రే.. మధ్యలో వెనక్కి తిరిగి స్వాత్రంత్యం వచ్చి ఎన్నేళ్లయిందని ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు నేను అక్కడ ఉంటేనా.. ఆయన చెంప పగలగొట్టేవాడిని' అని రాణే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి.
ఇదిలా ఉండగా.. సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ కేంద్రమంత్రిపై చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. ఆయనను తక్షణమే అరెస్టు చేసేందుకు నాసిక్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే అరెస్టు వార్తలను కేంద్రమంత్రి ఖండించారు. తాను సాధారణ వ్యక్తిని కాదని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని హెచ్చరించారు. అంతేగాక, తానేం తప్పూ చేయలేదంటూ తన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు. మరోవైపు కేంద్రమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ముంబయిలో భాజపా, శివసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. నగర వీధుల్లో ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు. అటు ముంబయిలోని రాణే నివాసం ముందు కూడా శివసేన కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన నివాసానికి పోలీసులు భద్రత పెంచారు.