Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్‌కు వచ్చిన ఓ మహిళ తాలిబన్ల దురాగతాలను పూస గుచ్చినట్లు వివరించారు. ఆడది బతికి ఉందా? చనిపోయిందా? అనేదానిని పట్టించుకోకుండా తాలిబన్లు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. శవాలపై సైతం అత్యాచారాలు చేస్తున్నారని, దీనిని మీరు ఊహించగలరా? అని ప్రశ్నించారు. తాను ఆఫ్ఘనిస్థాన్‌లో పోలీసు దళంలో పని చేశానని ఈ మహిళ చెప్పారు. కాబూల్ తాలిబన్ల వశమైన తర్వాత తాను అతి కష్టం మీద బారత్‌కు చేరుకున్నట్లు తెలిపారు. తాలిబన్లు మహిళలను ఎత్తుకెళ్ళిపోతున్నారని, ఎదిరించినవారిని కాల్చి చంపుతున్నారని చెప్పారు. తమకు ప్రతి కుటుంబం నుంచి మహిళలు కావాలని వారు డిమాండ్ చేస్తున్నారని వారి నిర్బంధంలో గడిపిన ఓ మహిళ తనకు చెప్పినట్లు తెలిపారు. తాలిబన్లు బెదిరించడంతో తాను ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చేశానని తెలిపారు. తమకు అనేక బెదిరింపులు వస్తున్నాయన్నారు. ఉద్యోగానికి వెళ్లేవారికి, వారి కుటుంబ సభ్యులకు ముప్పు తప్పదని చెప్పారు. ఒకసారి మాత్రమే హెచ్చరిస్తారని, ఇక హెచ్చరికలు ఉండవని అన్నారు.