Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్కళాశాలలోని చరిత్ర విభాగం, ప్రిజర్వ్ లర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఆర్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ (ప్లీచ్) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సి. గణేశ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై చరిత్ర విభాగం హెడ్ ప్రొఫెసర్ అర్జున్‌రావు కుతాడి, ప్లీచ్ చైర్మెన్ డాక్టర్ తేజస్విని సంతకాలు చేశారు. ప్లీచ్ అనే సంస్థ చరిత్ర, పురావస్తు విభాగాల పరిశోధనా సంస్థ.
అనంతరం ప్లీచ్ సీఈవో ప్రొఫెసర్ ఇ. శివనాగిరెడ్డి మాట్లాడుతూ ఈ ఒప్పందం ప్రకారం చరిత్ర విభాగానికి చెందిన అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, పీజీ విద్యార్థులకు ప్రత్యేక విద్య, పరిశోధనా అంశాలను తమ సంస్థ తరపున అందిస్తామని చెప్పారు. నూతన పరిశోధనా పద్ధతులపై శిక్షణ సైతం అందజేస్తామన్నారు. ఆర్ట్స్‌కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గణేశ్ మాట్లాడుతూ విద్యాకార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. ప్రొఫెసర్ అర్జున్‌రావు కుతాడి మాట్లాడుతూ శత వసంతాల చరిత్ర కలిగిన చరిత్ర విభాగంలో ఇప్పటి వరకు ఇటువంటి అవగాహనా ఒప్పందం జరుగలేదన్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అదనపు విషయ పరిజ్ఞానం సమకూరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హిస్టరీ విభాగం అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.