Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కొన్ని రోజుల క్రితమే భూమికి చాలా దగ్గరగా ఒక ఉల్కాశకలం దూసుకుపోయింది. గంటకు 94వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ ఉల్క గురించి మర్చిపోక ముందే. ఆస్ట్రోనామర్స్ మరో ఉల్కను గుర్తించారు. ఇది భూమికి దగ్గర్లో కాదు సూర్యుడికి దగ్గర్లో ఉంది. చిలీలోని డార్క్ ఎనర్జీ కెమెరా (డీఈక్యామ్)తో ఈ ఉల్కను గుర్తించారు. విక్టర్ ఎం బ్లాంక్ టెలిస్కోప్ ద్వారా సేకరించిన డేటాను పరిశీలించే సమయంలో స్కాట్ ఎస్ షెపర్డ్ అనే శాస్త్రవేత్త ఈ ఉల్కను గుర్తించారు. మన సౌరవ్యవస్థలో అత్యంత తక్కువ సగటు దూరం ఉన్న ఉల్క ఇదేనట. దీనికి 2021 పీహెచ్27 అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. దీని కక్ష్య చాలా చిన్నదని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ ఉల్క ప్రయాణించే మార్గం.. బుధుడు, శుక్ర గ్రహాల కక్ష్యలను కొన్ని చోట్ల క్రాస్ చేస్తుందని సమాచారం. ఈ ఉల్క అంగారక, గురు గ్రహాల మధ్య ఉండే ఆస్టరాయిడ్ బెల్ట్‌కు చెందింది అయ్యుండొచ్చని సైంటిస్టులు అంటున్నారు. సూర్యుడికి సమీపంలోని గ్రహాల ఆకర్షణ శక్తిలో వచ్చిన మార్పుల వల్ల ఈ ఉల్క సూర్యుడి దగ్గరకు వచ్చినట్లు భావిస్తున్నారు. లేదంటే సౌర వ్యవస్థ బయటి నుంచి వచ్చిన తోకచుక్క కూడా కావచ్చని అభిప్రాయపడుతున్నారు. చాలాకాలం కావడం వల్ల దీని కక్ష్య కూడా అస్థిరంగా ఉండొచ్చని, మరికొన్ని మిలియన్ల సంవత్సరాల్లో ఇది సూర్యుడిలోకి వెళ్లిపోవచ్చని చెప్తున్నారు. లేదంటే బుధ, శుక్ర గ్రహాలను ఢీకొట్టే ప్రమాదం కూడా ఉన్నట్లు ఆస్ట్రోనామర్లు భావిస్తున్నారు.