Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనంతపురం: అదనపు కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. పెండ్లైన మూడు నెలలకే అర్ధాంతరంగా తనువు చాలించింది. పోలీసులు తెలిపిన మేరకు...ముదిగుబ్బ మండలం మల్లమకొట్టాలకు చెందిన శ్రీరాములు, సరళమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. డిగ్రీ వరకు చదువుకున్న పెద్ద కుమార్తె సాదిక (20)కు మూడు నెలల క్రితం బుక్కపట్నం మండలం కృష్ణాపురం నివాసి కేశవతో వివాహమైంది. పెళ్లి సమయంలో 12 తులాల బంగారు నగలు, రూ.5 లక్షలు వరకట్నం కింద ఇచ్చారు. కదిరిలోని ఎస్బీఐ (యోగి వేమన)లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కేశవ.. తన భార్యను కృష్ణాపురంలో తల్లిదండ్రుల వద్ద ఉంచి, వారానికి ఒకసారి మాత్రమే వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో అదనపు కట్నం కింద మూడు తులాల బంగారు నగలు, డబ్బు తీసుకురావాలంటూ అత్త కొండమ్మ, ఆడపడచు, ఆమె భర్తతో పాటు కేశవ కూడా వేధించేవాడంటూ తల్లిదండ్రులకు సాదిక ఫోన్ చేసి చెప్పింది.
ఈ నెల 22న ఆదివారం సెలవు కావడంతో కేశవ.. కృష్ణాపురం వెళ్లాడు. ఆ సమయంలో అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను కొట్టి పుట్టింటికి పంపాడు. మంగళవారం ఉదయం సాదిక తమ పొలానికి వెళ్లి, తండ్రి శ్రీరాములుకు ఫోన్ చేసింది. తన భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేకపోతున్నానని, జీవితంపై విరక్తితో బావిలో దూకి చనిపోతున్నట్లు చెప్పింది. తండ్రి వారిస్తున్నా వినలేదు. దీంతో అతను వెంటనే పొలంలోని వ్యవసాయ బావి వద్దకు చేరుకున్నాడు. అప్పటికే బావిలో సాదిక మృతదేహం తేలియాడుతోంది. సమాచారం అందుకున్న పట్నం ఎస్ఐ సాగర్, సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. సంఘటనా స్థలాన్ని కదిరి ఇన్చార్జి డీఎస్పీ ప్రసాదరెడ్డి, నల్లమాడ సీఐ యల్లమరాజు, తహసీల్దార్ కరుణాకర్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ ప్రసాదరెడ్డి తెలిపారు.