Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పుణేలో దారుణం చోటుచేసుకుంది. ఓ సెక్స్ వర్కర్ దారుణ హత్యకు గురైంది. అయితే హత్య చేసిన వ్యక్తి ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి మూడు సూట్‌కేసుల్లో నింపి వాటిని పుణేలోని ముత ఘాట్ వద్ద నదిలో పడేశాడు. అనంతరం నిందితుడు పోలీసులు ముందు లొంగిపోయాడు ఈ ఘటన సంచలనం సృష్టించింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైకి చెందిన ఓ మహిళ ఏడాది కిందట పుణేలోని బుధవార్పేటకు వచ్చి సెక్స్ వర్కర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెతో హనమంత్ షిండే అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కోసం నారాయణ పేట్‌లోని ఓ ఫ్లాట్‌ను నిందితుడు అద్దెకు తీసుకున్నాడు. ఈనెల 12న బుధవారపేటలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో మహిళను అతను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి మూడు సూట్ కేసుల్లో నింపాడు. వాటిని తీసుకెళ్లి పుణేలోని ముత ఘాట్ వద్ద నదిలో అక్కడక్కడ పడేశాడు. అయితే బుధవార్ పేట్‌లోని వ్యభిచార గృహ నిర్వాహకులు మహిళ కనిపించడంలేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
ఆమెతో చనువుగా ఉండే హనమంత్ షిండేను విచారించగా నేరాన్ని అంగీకరించాడు. మహిళ మృతదేహం భాగాలను నింపిన సూట్‌కేసుల వద్దకు పోలీసులను తీసుకెళ్లాడు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.