Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దళితబంధు అందరికి ఇవ్వాలనేదే తమ డిమాండ్ అని.. ఒకవేళ బడ్జెట్ సరిపోకపోతే సెక్రటేరియేట్, అసెంబ్లీ అమ్ముదామని.. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పితే పెడుతామని ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. మూడు చింతల పల్లి దీక్ష వద్ద ఆయన మాట్లాడారు. 20 ఏండ్లు అధికారం మనదే అన్నప్పుడే కేసీఆర్ తన ఓటమిని అంగీకరించారని.. ఆయనకు 20 నెలల భయం పట్టుకుంది అని చెప్పారు. మొదటి సారి కేసీఆర్ లో భయం కనిపిస్తున్నదన్నారు. అందుకే అంచనాలు లేని హామీలు ఇస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం తర్వాత ఎవరూ మీడియాతో మాట్లాడలేదన్నారు. చివరికి కేసీఆర్ ఆవేదన చూసి కేటీఆర్ మీడియా సమావేశం పెట్టారని ఎద్దేవా చేశారు. తెరాసలో ఉద్ధండులు కూడా మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నారని అన్నారు.
భవిష్యత్ లో టీఆర్ఎస్ సీనియర్ లీడర్లు కూడా కేసీఆర్ పక్కన కూర్చోడానికి బయపడతారని.. కేసీఆర్ ఒంటరి వాడు అయ్యాడన్నారు. కేసీఆర్. ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నాడని ఆ భ్రమల నుంచి ప్రజలు ఇప్పుడు బయటకు వస్తున్నారు అని చెప్పారు. తాను రాత్రి దళిత వాడలో పడుకున్న ఇండ్లు 35 సంవత్సరాల క్రితం నాటి ఇందిరమ్మ ఇండ్లు అని అన్నారు. మూడు చింతలపల్లి గ్రామానికి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు. మూడు చింతలపల్లిలో కేసీఆర్ ఫాంహౌస్ కోసం రెండేండ్ల క్రితం రోడ్డును 6ఫీట్లకు పెంచారని దాంతో ఇండ్లు కిందకు అయ్యాయని, రోడ్డు పైకి అయిందన్నారు. వర్షం పడగానే ఆ ఇండ్లు చెరువుల్లా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తా అని ఇంతవరకు ఇవ్వలేదు అని అన్నారు. అనంతరం రేవంత్ కు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, కాంగ్రెస్ నేతలు..నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.