Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ‘నేనేం పారిపోలా... మర్డర్ చేసి ఇక్కడే ఉన్నా... అవును.. ఆస్తి గొడవల వల్లే చంపేశా... ఇప్పుడేంటి...’ సొంత బాబాయిని చంపిన యువకుడు మృతదేహం చెంత మాట్లాడిన మాటలివి. ఈ భయానక ఘటన ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని పెదారికట్ల ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గర బుధవారం జరిగింది. మృతుడిని కనిగిరి మండలం యడవల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు(48)గా గుర్తించారు. అదే గ్రామంలో ఉండే ఆయన రెండో అన్న వెంకట నారాయణ కుటుంబంతో వెంకటేశ్వరరావుకు ఆస్తి వివాదాలు నెలకొన్నాయి. ఆస్తి సమస్యను పరిష్కరించాలంటూ వారం క్రితం కనిగిరిలో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు వెంకటేశ్వరరావు అర్జీ ఇచ్చారు. అధికారులు వచ్చి విచారణ చేశారు. దీంతో ద్వేషం పెంచుకున్న వెంకట నారాయణ కుమారుడు పుల్లారావు మద్యం తాగుదామంటూ వెంకటేశ్వరరావును పెదారికట్లకు తీసుకెళ్లాడు. మద్యం తాగాక గొడవ పెట్టుకొని సీసా పగులగొట్టి గొంతులో పొడిచి చంపాడు. పథకం ప్రకారమే హత్య చేసినట్లు చుట్టూ గుమిగూడిన వారితో నిర్భయంగా చెప్పిన నిందితుడు... తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ దృశ్యాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.