Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హెడింగ్లీ: ఇంగ్లండ్ అభిమానులు మరోసారి టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అతనిపైకి ఓ ప్లాస్టిక్ బాల్‌ను విసిరారు. ఈ ఘటనపై కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ బాల్‌ను తిరిగి గ్రౌండ్ బయటకు విసిరేయాలని సిరాజ్‌కు కోహ్లి ఎంతో ఆగ్రహంగా చెప్పడం టీవీ కెమెరాలు చూపించాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వికెట్ కీపర్ రిషబ్ పంత్ వెల్లడించాడు. ఎవరో సిరాజ్‌పై బాల్ విసిరారు. దీనిపై కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజమే అని పంత్ చెప్పాడు. మీరు ఏం అనాలనుకుంటే అది అనండి. కానీ ఫీల్డర్లపై ఇలా వస్తువులను విసరకండి. అది క్రికెట్‌కు మంచిది కాదు అని పంత్ అన్నాడు.
ఇక ఇదే మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 78 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. దీనిపై సిరాజ్‌ను కవ్వించే ప్రయత్నం ఇంగ్లండ్ అభిమానులు చేశారు. బౌండరీ దగ్గర ఉన్న సిరాజ్‌ను స్కోర్ ఎంత అంటూ వాళ్లు అడిగారు. అయితే దీనికి సిరాజ్ కూడా దిమ్మదిరిగే సమాధానమిచ్చాడు. 1-0 అంటూ సిరీస్‌లో ఇండియా ఆధిక్యంలో ఉందన్న విషయాన్ని సైగల ద్వారా అభిమానులకు సిరాజ్ చెప్పడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. లార్డ్స్ టెస్ట్ విజయంలో కీలకపాత్ర పోషించిన సిరాజ్‌పై గతంలో ఆస్ట్రేలియా అభిమానులు కూడా అనుచితంగా వ్యవహరించారు. అతనిపై నోరు పారేసుకున్నారు. ఈ విషయాన్ని వెంటనే అతడు అంపైర్లకు చెప్పడంతో ఆ అభిమానులను గ్రౌండ్ నుంచి పంపించేశారు. ఇక ఇంగ్లండ్‌లో ఇండియన్ క్రికెటర్లపై అక్కడి అభిమానులు ఇలా ప్రవర్తించడం కూడా ఇదే తొలిసారి కాదు. రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో కేఎల్ రాహుల్‌పై అభిమానులు బాటిల్ మూతలను విసిరారు.