Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హుజూరాబాద్ డ్రామా మొదలైందని, అందులో బీజేపీ కూడా అద్భుతంగా నటిస్తోందని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. గురువారం కరీంనగర్లో బీఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. తాను నిర్వహించే సభలకు కేసీఆర్ ప్రభుత్వం కరెంట్ కట్ చేస్తోందని.. తాను అధికారంలోకి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్‌కు కరెంట్ కట్ చేస్తానని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఎవరు గెలిచినా ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు. సీఎం రేపే అసెంబ్లీ రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నారు..ముదిరాజ్ బిడ్డను ఓడించి ఎవరికి పాఠం నేర్పాలనుకుంటున్నారని, ఈటలకు గుణపాఠం చెప్పేందుకు వందలకోట్లు ఖర్చు చేస్తారా అంటూ ప్రశ్నించారు.
ఇక నిన్న తొడగొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ చేసిన మంత్రి మల్లారెడ్డి పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. మల్లారెడ్డీ ..మంత్రి హోదాలో ఉండి తొడ గొట్టి మాట్లాడుతున్నారని ఆయన కాలేజీల్లో విద్యార్థులకు నేర్పేది ఇదేనా అని ప్రశ్నించారు.మల్లారెడ్డిని వెంటనే పదవి నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు దోపిడీకి గురయ్యాయని ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. బహుజన రాజ్యం వస్తే కాళేశ్వరం కాదు జ్ఞానేశ్వరాన్ని తీసుకొస్తామని అన్నారు. నిరుద్యోగులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. బూతులు మాట్లాడేవాళ్లకు వర్సిటీలు ఇస్తున్నారు ఆయన మండిపడ్డారు.