Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అఫ్ఘనిస్తాన్ లో రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. దేశం విడిచి వెళ్లిపోయేందుకు వేలాది మంది కాబుల్ లోని ఎయిర్ పోర్ట్ బయట గురువారం వేచిచూస్తుండగా భారీ పేలుళ్లు జరిగాయి. ముందు విమానాశ్రయం గేటు వద్ద పేలుడు జరిగగా అమెరికా సైనికులతో పాటు పౌరులు మరణించారని పెంటగాన్ ప్రెస్ సెక్రెటరీ జాన్ కిర్బీ తెలిపారు. కాసేపటికి గేటుకు సమీపంలోని బారోన్ హోటల్ వద్ద మరో పేలుడు జరిగిందని వారు తెలిపారు.ఈ ఘటనలో 13 మంది మృతి చెందినట్టు సమాచారం. మరణించిన వారిలో పిల్లలు కూడా ఉన్నారని, తాలిబన్ ప్రతినిధులు తెలిపారు తెలిపారు. పలువురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇవి ఆత్మాహుతి దాడులేనని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. మరోవైపు అమెరికా రక్షణ శాఖ కూడా దీన్ని ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నట్టు తెలిపింది.
అయితే మరో పేలుడు కూడా జరిగే అవకాశం ఉందని అమెరికా ఆర్మీ హెచ్చరించింది. కాబుల్ ఎయిర్పోర్టుపై ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని అమెరికా సహా నాటో దేశాలు కొన్ని గంటల క్రితమే హెచ్చరించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ పేలుడుకు ముందే అఫ్ఘనిస్తాన్ నుంచి ఇటలీ దేశానికి చెందిన వారిని తరలించేందుకు ఇటలీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన విమానంలో మంటలు చెలరేగాయి. కాబూల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలను గుర్తించారు. వెంటనే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిసింది. అయితే విమానాన్ని ఆపేందుకు తాలిబాన్లే కాల్పులకు దిగినట్టు సమాచారం. కాబూల్ విమానాశ్రయానికి ఉగ్ర ముప్పు పొంచి ఉన్నదని ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.