Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ట్రాన్స్కోఆండ్ జేన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు మానవత్వానికి మారు పేరుగా నిలుస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పురం మండలం మల్లారెడ్డి గూడెం గ్రామంలో ఇద్దరు అనాథల ఇల్లు కూలిపోవడంతో వారికి ఇల్లు కట్టించి ఇచ్చారు
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నూతనకంటి రాములు, ఉషమ్మ దంపతులు. వీరికి కూతురు రాజేశ్వరి(11), కుమారుడు శివ (9) ఉన్నారు. ఏడేండ్ల క్రితం తండ్రి మృతి చెందగా, సంవత్సరం క్రితం తల్లి చనిపోయింది. దాంతో వారు అనాథలు కాగా ఇటీవల వారు ఉంటున్న ఇల్లు వర్షానికి కూలిపోయింది. విషయం తెలుసుకున్న ట్రాన్స్కోఆండ్ జేన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పిల్లలకు కొత్త ఇల్లు కట్టించి ఇచ్చారు. గురువారం చిన్నారులు, విద్యుత్ అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి తో గృహ ప్రవేశం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. అంజయ్య మాట్లాడుతూ చిన్న తనం లో తల్లిదండ్రులు కోల్పోయిన ఈ చిన్నారులకు ఉండడానికి ఇల్లు లేదని తెలుసుకున్న వెంటనే ప్రభాకర్ రావు వారికి సాయం చేయాలని తెలిపారన్నారు. కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే వారికి నూతన గృహం కట్టించడం జరిగిందని, మున్ముందు అ చిన్నారులకు కావాల్సిన సహాయం, చదువు విషయం లో మా విద్యుత్ ఉద్యోగుల సంస్థ వారికి తోడుగా ఉంటుందన్నారు. ఇంటి తో పాటు వారికి ఒక ఆరు నెలల కి సరిపడు నిత్యావసర సరుకులు కూడా అందిస్తామని తెలిపారు. తమతో పాటు చాలా మంది వ్యక్తులు వారికి తోచిన సాయం చేస్తున్నందుకు వారికి పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతున్నట్టు తెలిపారు. అనంతరం చిన్నారులు మాట్లాడుతూ తాము ఉండడానికి నూతన ఇంటి నిర్మాణం చేసి ఇచ్చినందుకు సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావుకు, అంజయ్యకు కృతజ్ఞతలు చెబుతున్నట్టు తెలిపారు. తమ ఇంటి కలను సాకారం చేసిన ప్రభాకర్ రావు సారు జీవితాంతం సల్లగా ఉండాలని చిన్నారులు కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో డి ఈ ఈ శివ శంకర్, సర్పంచ్ కొండ పద్మ శ్రీను, ఎంపీటీసీ నరి పావని నరసింహ , విద్యుత్ శాఖ అధికారులు చుక్క గిరి, బోయ మల్లేష్, వీశాల, వెంకన్న మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు