Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘం (హెచ్ఆర్సీ) ప్రధాన కార్యాలయం కర్నూలులో ఏర్పాటు కానుంది. 2017లో అమరావతి కేంద్రంగా హెచ్ఆర్సీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా.. హెచ్ఆర్సీ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు మారుస్తూ గెజిట్ విడుదల చేసింది. హెచ్ఆర్సీ కార్యాలయ మార్పు విషయమై హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ మాట్లాడుతూ.. కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం కూడా ఆమోదించిందని తెలిపారు. హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యులు కర్నూలులో రెండు ప్రాంగణాలను పరిశీలించారని, అయితే అవి అనుకూలంగా లేకపోవడంతో మరోటి పరిశీలనలో ఉందని తెలిపారు. హెచ్ఆర్సీ ఏర్పాటుకు సంబంధించిన పురోగతిని తెలిపేందుకు విచారణను నెల రోజులపాటు వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది సురేశ్ కుమార్ తన వాదనలు వినిపిస్తూ.. కర్నూలులో హెచ్ఆర్సీ కార్యాలయం ఏర్పాటు చేస్తే ప్రజలకు దూరమైపోతుందన్నారు. స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం.. కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది విశేషాధికారం రాష్ట్రానికి ఉంటుందని పేర్కొంటూ విచారణను నెల రోజులు వాయిదా వేసింది.