Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తాలిబాన్ల చెరలోకి వెళ్లిన అఫ్ఘానిస్థాన్ గురువారం రక్తమోడింది. అఫ్ఘాన్‌ను వీడేందుకు రాజధాని నగరం కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గుమిగూడిన విదేశీయులే లక్ష్యంగా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు ఫిదాయీ(ఆత్మాహుతి) దాడులకు తెగబడ్డారు. మూడు మానవబాంబు దాడుల్లో.. మహిళలు, చిన్నారులు, అమెరికా నౌకాదళానికి చెందిన 11 మంది సైనికులు, ఒక వైద్యుడు, అమెరికా మిలటరీ దళానికి చెందిన మరో ఇద్దరు సహా 72 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అఫ్ఘాన్ వర్గాలు చెబుతున్నాయి. మరో 140 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో అమెరికా భద్రత దళాలకు చెందిన పలువురు సైనికులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం కాబూల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న అమెరికా సైనికులను ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించారు.
తాలిబాన్ల రాక్షస పాలనలోకి వెళ్తున్న అఫ్ఘానిస్థాన్‌కు ఐఎస్ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, కాబూల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని మానవ, కారు బాంబులతో విరుచుకుపడే ప్రమాదముందంటూ అగ్ర దేశాల నిఘావర్గాలు హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం..! ఐఎస్-కేపీ(ఖోరాసన్ ప్రావిన్స్) ప్రాంతీయ శాఖకు చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విమానాశ్రయం, దాని పరిసరాల్లో గుమిగూడిన విదేశీయులే టార్గెట్‌గా పేలుళ్లకు పాల్పడనున్నట్లు బ్రిటిష్ సాయుధ బలగాల మంత్రి జేమ్స్ హీపే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఐరోపాలోని అమెరికా మిలటరీ చీఫ్ టోడ్ వాల్టర్స్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్ పేన్ బుధ, గురువారాల్లో వేర్వేరు ప్రకటనలు చేశారు. ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవల్‌పమెంట్ ఆఫీ్‌స(ఎ్ఫసీడీవో) కూడా కాబూల్‌లో విదేశీయులే లక్ష్యంగా ఐఎస్ దాడుల ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేసింది.