పామును మెడలో వేసుకుని ముద్దు పెట్టిన వ్యక్తి.. తీవ్ర అస్వస్థత
Tue 25 Jan 12:26:35.267372 2022
హైదరాబాద్ : జనవాసాల మధ్యకు వచ్చిన ఓ పామును పట్టుకున్న వ్యక్తి దానిని మెడలో వేసుకుని ముద్దు పెట్టాడు. అయితే కాసేపటికి అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు ప్రస్తుతం అతను ప్రాణాలతో కొట్టుకమిట్టాడుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ఆకాష్ హైదరాబాద్ కు వలసవచ్చి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మేడ్చల్ జిల్లా గాజూలరామారం పరిధిలోని కట్టమైసమ్మ బస్తీలో నివాసముంటున్నాడు. అతను స్థానికంగా రాళ్లను కొడుతూ జీవిస్తున్నాడు. అలాగే అతను పాములను పట్టుకోవడంలో దిట్ట . ఈ క్రమంలో ఆదివారం రాత్రి జనవాసాల్లోకి వచ్చిన ఓ పామును అతను పట్టుకున్నాడు. అంతేకాక దాన్ని మెడలో వేసుకుని ముద్దుపెడుతూ ఫొటోలకు పోజులిచ్చాడు. అనంతరం సర్పాన్ని వదిలిపెట్టాడు. అయితే అదేరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో అతను అస్వస్థతకు గురయ్యాడు. దాంతో అతనిని సూరారంలోని నారాయణ ఆస్పత్రికి తరలించారు. పాము కాటు వేయడంతోనే అస్వస్థతకు గురైనట్లు, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.