Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశ ఆర్థిక దుస్థితిపై పార్లమెంట్లో చర్చ జరగాల్సి ఉందని, అయితే, అలా జరగడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి వాస్తవాలు చెప్పకుండా పొగడ్తలతో సరిపెడుతున్నారు. ఆయన కూడా వాటిని విని మురిసిపోతున్నారని ఎద్దేవా చేశారు. అన్నీ తెలిసే సమయానికి ఆయన మాజీ ప్రధాని అయిపోతారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆసక్తికర కథను కేసీఆర్ చెప్పుకొచ్చారు. ‘‘భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందటున్నారు. అది చాలా తక్కువ. అభివృద్ధికి సూచిక అయిన తలసరి ఆదాయంలో భారత్ 138వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక కంటే మన తలసరి ఆదాయం తక్కువ. దేశ ఆర్థిక దుస్థితిపై పార్లమెంట్లో చర్చ జరగాల్సి ఉంది. కానీ, అలా జరగట్లేదు. పైగా అక్కడ అందరూ మోడీని పొగుడుతున్నారు. పార్లమెంట్లో ఈ వ్యవహారం చూస్తుంటే నాకు ఒక కథ గుర్తుకు వస్తోంది. తిరుమల రాయుడనే రాజు ఉన్నాడు. దురదృష్టవశాత్తూ ఆయనకు ఒకటే కన్ను. ఇదే విషయంలో ఆయన బాధపడుతుంటాడు. అదే రాజ్యంలో ఒక కవి కూడా ఉన్నాడు. అతడికి ఏవో సమస్యలు రాజుగారి దగ్గర బహుమానం పొందాలంటే ఆయన్ను పొగడాలని అందరూ సలహా ఇస్తారు. కవికి అవసరం ఉంది కాబట్టి, ఇష్టం లేకపోయినా ‘అన్నాతిగూడి హరుడవు.. అన్నాతిని గూడనపుడు అసుర గురుండవు. అన్నా తిరుమలరాయ కన్నొక్కటే లేదు గానీ, కౌరవపతివే’ అని కవిత్వం చెబుతాడు.
అంటే, భార్యతో ఉన్నప్పుడు నువ్వు మూడు కళ్ల శివుడవు. ఆయన భార్య రెండు కళ్లతో కలిపి మూడు కళ్లు కలిగినవాడని అర్థం. ఇక భార్యతో లేనప్పుడు నువ్వు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడంతటి వాడివి. ఆ ఒక్క కన్ను కూడా లేకపోతే నువ్వేమైనా తక్కువ వాడివా ‘కౌరవపతి’. అంటే ధృతరాష్ట్రుడంతటి వాడివి’ అని పొగుడుతాడు. ఇప్పుడు పార్లమెంట్లో ప్రధాని మోడీని ఉద్దేశించి ఇలాగే పొగుడుతున్నారు. మంచి పనులు చేయాలి.. అభివృద్ధి చేయాలని చెప్పకుండా ‘బాగుంది.. బాగుంది..’ అని చెబుతున్నారు. మాజీ ప్రధాని అయిన తర్వాత అప్పుడు అసలు సంగతి చెబుతారు. అయినా మాజీ ప్రధాని అంటే తక్కువా. మంచి ప్రదర్శన లేనప్పుడు కూడా అనవసరంగా పొగడటం మంచికి దారితీయదు’’ అంటూ కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.