Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కామారెడ్డి
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఒక నెలకు ఏకంగా రూ.11.41 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి జనవరి నెలకు సంబంధించి రూ.11,41,63,672 విద్యుత్ బిల్లు వేశారు. దీంతో విద్యుత్ బిల్లును చూసిన సర్పంచి, కార్యదర్శి కంగుతిన్నారు. రూ.కోట్లలో కరెంట్ బిల్లు రావడంతో గ్రామస్థులు సైతం ఆందోళనకు గురయ్యారు. దీనిపై పంచాయతీ పాలకవర్గం, కార్యదర్శి, సర్పంచి విద్యుత్ అధికారులను నిలదీశారు.
ఓవైపు గ్రామపంచాయతీలకు నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు విద్యుత్ అధికారులు ఏసీడీ ఛార్జీల పేరుతో భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంచాయతీ కార్యాలయానికి రూ.కోట్లలో విద్యుత్ బిల్లు వచ్చిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మాచారెడ్డి ఏఈ వెంకటరమణ వివరణ కోరగా.. సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ బిల్లు రూ.కోట్లలో వచ్చిందని, ఉన్నతాధికారుల సహకారంతో బిల్లును పునరుద్ధరిస్తామని ఏఈ తెలిపారు.