Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. ఈ జక్కన అద్భుతంపై సినీప్రియులంతా ప్రశంసలు కురిపించారు. ‘అవతార్’ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ గతంలో ఓసారి ‘ఆర్ఆర్ఆర్’ను పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ఈ సినిమా చూసినప్పుడు తనకు కలిగిన అనుభూతిని గురించి తెలిపారు.
‘ఆర్ఆర్ఆర్’ చూసి ఆశ్చర్యపోయానని చెప్పిన జేమ్స్ కామెరూన్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా నచ్చిందని అన్నారు. ఓ ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఆర్ఆర్ఆర్’ ఒక అద్భుతం. నేను మొదటిసారి చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. గ్రాఫిక్స్ మాత్రమే కాదు కథలో ఉన్న ప్రతి పాత్రను చాలా బాగా చూపించారు. కథ చెప్పడంలో షేక్స్పియర్ను తలపించారు. ఇక సినిమాలో రామ్ పాత్ర మరో స్థాయిలో ఉంది. రాజమౌళితో వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడాలనుకున్నా. కానీ, అతడిని కలిసినప్పుడు అంత సమయం దొరకలేదు. అందుకే సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఈ సినిమా గురించి అతడితో ఇంకా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను’’ అని చెప్పారు. ఇక ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకుంది. ఇటీవల ప్రకటించిన ఆస్కార్ నామినేషన్లలోనూ ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే.