Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జైపుర్
ఢిల్లీ- ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే దేశాభివృద్ధిలో బలమైన స్తంభంగా నిలవనుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా ఢిల్లీ- దౌసా- లాల్‌సోట్‌ల మధ్య పూర్తయిన తొలిదశ రహదారిని ప్రధాని మోడీ ప్రారంభించారు. రాజస్థాన్‌లోని దౌసాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీంతోపాటు రూ.18,100 కోట్లతో చేపట్టనున్న నాలుగు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. తొలిదశలో మొత్తం 247 కిలోమీటర్ల మేర ఈ రహదారిని ఎనిమిది లేన్లుగా రూ.10,400 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీనివల్ల ఇక మీదట మూడున్నర గంట్లలోనే ఢిల్లీ నుంచి జైపుర్‌కు చేరుకోవచ్చు. ప్రస్తుతం 5 గంటల సమయం పడుతోంది.
2019 మార్చి 9న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. డిల్లీతోపాటు మధ్యలో అయిదు రాష్ట్రాలను (హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర) కలుపుతూ 1386 కిలోమీటర్ల మేర ఈ రహదారి వెళుతోంది. జైపుర్, అజ్మేర్, కోటా, ఉదయ్‌పుర్, చిత్తోర్‌గఢ్, భోపాల్, ఇందౌర్, ఉజ్జయిని, అహ్మదాబాద్, సూరత్, వడోదరా లాంటి ప్రధాన పట్టణాలను కలుపుతుంది. ఈ రహదారి పూర్తిగా సిద్ధమైతే ఢిల్లీ, ముంబయిల మధ్య ప్రస్తుతం ఉన్న దూరం 180 కిలోమీటర్ల మేర తగ్గుతుంది. ప్రయాణ సమయం సైతం 24 గంటల నుంచి ఏకంగా 12 గంటలకు తగ్గిపోతుంది. ఈ రహదారి నిర్మాణం కోసం అయిదు రాష్ట్రాల్లోని 15 వేల హెక్టార్ల భూమిని సమీకరించారు. సుమారు రూ.లక్ష కోట్లతో పనులు చేపడుతున్నారు. ఈ ఏడాది చివరికల్లా ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిగా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.