Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీశైలం
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు ఆదివారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవశక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవదైన శ్రీశైలమహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భ్రామరి సమేతుడైన ముక్కంటీశుడు త్రిశూలధారియై భృంగివాహనంపై విహరించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండోరోజు వైభవంగా సాగాయి. చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణాలు శాస్త్రోక్తంగా జరిగాయని ఈవో లవన్న తెలిపారు. సాయంకాలార్చనలు, హోమాల తర్వాత అక్క మహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన భృంగి వాహనంపై వేంచేబు చేసి షోడశోపచార పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, డప్పుచప్పుళ్లతో క్షేత్ర ప్రధాన వీధుల్లో ఊరేగించారు.