Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పల్నాడు
పల్నాడు జిల్లా కారంపూడి కస్తూర్బా పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన శనివారం రాత్రి జరిగింది. విద్యార్థినులు, తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. పాఠశాలలోని మరుగుదొడ్లను శుభ్రం చేసే పనిని తరగతుల వారీగా వంతులు వేసి విద్యార్థినులతో చేయిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 6వ తరగతికి చెందిన విద్యార్థినులు మరుగుదొడ్లు శుభ్రం చేస్తుండగా దుర్వాసనకు ఇద్దరు వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కొద్దిసేపటికి తేరుకున్నారు. ఉదయం వారి తల్లిదండ్రులు పాఠశాలకు రాగా విద్యార్థినులు విషయాన్ని తెలిపారు. తాము పాఠశాలలో ఉండలేమని, ఇంటికి తీసుకెళ్లాలని కోరారు. ఆహారం సైతం నాసిరకంగా ఉంటోందని వాపోయారు. విషయం తెలుసుకున్న ఎంఈవో నాగయ్య పాఠశాలను పరిశీలించి ప్రత్యేక అధికారిణి శైలజను ప్రశ్నించి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు మరుగుదొడ్లు శుభ్రం చేసే ఆయాకు సాయంగా వెళ్లారని, దుర్వాసనకు వాంతులయ్యాయని పేర్కొన్నారు.