Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : న్యూజిలాండ్‌ను తుఫాన్ చుట్టుముట్టింది. ఫలితంగా పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు రాత్రి వేళ చీకట్లోనే వెల్లదీస్తున్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి వాహనాలు ధ్వంసమయ్యాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పెద్ద సంఖ్యలో విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రూ.60 కోట్ల సహాయక ప్యాకేజీని ప్రధాని క్రిస్ హిప్కిన్స్ ప్రకటించారు.
న్యూజిలాండ్‌ను గాబ్రియెల్ తుఫాను వణికిస్తున్నది. దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో 250 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆక్లాండ్ నగరంలో గాలి వేగం ప్రస్తుతం గంటకు 110 కిలోమీటర్లుగా ఉన్నది. ఉత్తరాది ప్రాంతాల్లో దాదాపు 46 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆక్లాండ్‌లో గత 24 గంటల్లో 4 అంగుళాల వర్షం కురిసింది. ఇక్కడ సముద్ర మట్టం వేగంగా పెరుగుతున్నది. ప్రజలు ముందుజాగ్రత్త చర్యగా ఇళ్లు, గోదాముల బయట వరద నీటిని అడ్డుకునేందుకు ఇసుక బస్తాలు వేసుకున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో దేశంలో 509 విమానాలను రద్దు చేశారు. మట్కానా తీరంలో మాథెసన్స్ బే బీచ్‌లో చాలా ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి. న్యూజిలాండ్ వాతావరణ విభాగం ప్రకారం, హరికేన్ గాబ్రియేల్ ఇప్పుడే తీరం దాటింది. ఇంతలో విద్యుత్ లైన్లు, రోడ్లు, చెట్లు దెబ్బతిన్నాయి. వచ్చే 24 గంటలు కీలకమని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఈ తుఫాను ప్రమాదకరమని పేర్కొన్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్.. ప్రజల సహాయం కోసం రూ.60,37,83,000 ప్యాకేజీని ప్రకటించారు. తీర రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుఫాన్ మరీ పెరిగిపోయిన పక్షంలో ఎమర్జెన్సీ విధించేందుకు సిద్ధమని న్యూజిలాండ్ ఎమర్జెన్సీ మేనేజిమెంట్ శాఖ మంత్రి కీరన్ మెక్‌అనుల్టీ వెల్లడించారు.