Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాణి అనే కంటిచూపు లేని అమ్మాయిని రాజు అనే రౌడీషీటర్ దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో అంధ యువతి హత్యకు గురైన ఘటన కలిచివేసిందని తెలిపారు. కంటిచూపునకు నోచుకోని యువతిని వేధింపులకు గురిచేసి కిరాతకంగా నరికి చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సదరు వ్యక్తి గంజాయి మత్తులో నేరానికి ఒడిగట్టాడని, గతంలోనూ పోలీసులపైనా, మహిళలపైనా దాడులకు తెగబడ్డాడని పోలీసులు చెబుతున్నారని పవన్ వివరించారు. ఈ ఘటనను శాంతిభద్రతల వైఫల్యంగా చూడాలని పేర్కొన్నారు. సీఎం నివాసం పరిసరాల్లో పటిష్టమైన పోలీసు పహరా, నిఘా వ్యవస్థలు ఉంటాయని, అయినప్పటికీ తాడేపల్లి ప్రాంతం అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా మారిందని తెలిపారు. ఏడాదిన్నర కిందట ఇదే ప్రాంతంలో ఓ యువతిపై లైంగికదాడి చేసిన ఘటనలో నిందితుల్లో ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయారంటే వైఫల్యం ఎవరిదని పవన్ నిలదీశారు. తన నివాసం పరిసరాల్లో పరిస్థితులనే సమీక్షించకుండా మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా ఒకటే, పేటలో ఉన్నా ఒకటేనని విమర్శించారు. పోలీసు శాఖకు అవార్డులు వచ్చాయని, దిశా చట్టం చేశామని చెప్పుకోవడం తప్ప రాష్ట్రంలో ఆడబిడ్డలకు మాత్రం రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు ఉన్నతాధికారులే పటిష్ట చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలపై అన్ని వర్గాలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.