Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైయస్ఆర్
వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని చదువులో ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం భోగ్యంపల్లెకు చెందిన యోగాంజనేయులు, విజయకుమారి దంపతుల కుమార్తె అఖిల(21) ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఈసీఈ చివరి సంవత్సరం చదువుతోంది. సోమవారం క్యాంపస్‌లోని హాస్టల్‌గదిలో తోటి విద్యార్థినులు లేని సమయంలో కిటీకికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థిని అటుగా వెళ్లి తలుపు తట్టగా తీయలేదు. మరికొందరు విద్యార్థినులు అక్కడికి చేరుకుని కేకలు వేయడంతో భద్రతా సిబ్బంది వెళ్లిచూడగా అఖిల కిటికీకి వేలాడుతూ విగతజీవిగా కన్పించింది. ఆర్జీయూకేటీ ఉప కులపతి విజయకుమార్, డైరెక్టర్ సంధ్యారాణి తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు.
డైరెక్టర్‌పై విద్యార్థిని కుటుంబ సభ్యుల ఆగ్రహం
విద్యార్థిని తల్లి, కుటుంబ సభ్యులు ఇడుపులపాయ చేరుకుని డైరెక్టర్ సంధ్యారాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లి విజయకుమారి కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రేమ విఫలం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా సమాచారం అందినట్లు డైరెక్టర్ చెప్పగా తల్లి, కుటుంబసభ్యులు ఆమెపై మండిపడ్డారు. అలాంటి ఆలోచనలు తమ బిడ్డకు లేవని, చదువులో ఒత్తిడి వల్లే ఈ ఘటన జరిగిందని వారు పేర్కొన్నారు. తమ కుమార్తె ఫోన్ చేసినప్పుడల్లా ఈ విషయం చెప్పేదని విద్యార్థిని తల్లి చెప్పారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.