Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తమిళనాడు
తమిళనాడులో తీరని విషాదం నెలకొంది. ఆకలి బాధ భరించలేక ఇద్దరు మరణిస్తే, వారిని ఖననం చేసే స్తోమత కూడా లేకపోవడంతో వారం రోజులుగా వారి మృతదేహాలు ఇంట్లోనే ఉంచుకున్న ఘటన ఈరోడ్ జిల్లాలోని గోపిచెట్టిపాళయంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శాంతి-మోహనసుందరం దంపతులకు మానసిక దివ్యాంగుడైన కుమారుడు శరవణకుమార్, కుమార్తె శశిరేఖ ఉన్నారు. శాంతి తల్లి కనకంబాళ్ కూడా వీరితోనే ఉంటున్నారు. శశిరేఖ పెళ్లయ్యేంత వరకు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించింది. పెళ్లయ్యాక కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో పస్తులు సర్వసాధారణమయ్యాయి. వారి బాధలు చూడలేక చుట్టుపక్కల వారు అప్పుడప్పుడు ఆహారం పెట్టేవారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం మోహనసుందరం, కనకంబాళ్ మృతి చెందారు.
అయితే, ఖననం చేసే స్తోమత కూడా లేకపోవడంతో శాంతి ఆ మృతదేహాలను ఇంట్లోనే ఉంచుకుంది. మృతదేహాల నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం వాటిని ఖననం చేశారు.