Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాజస్థాన్
రాజస్థాన్ కోటా జిల్లాలోని ఎస్బీఎస్ ఆస్పత్రి వినూత్న వివాహానికి వేదికైంది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన యువతిని వివాహం చేసుకునేందుకు ఓ యువకుడు ఊరేగింపుతో అక్కడకు వచ్చాడు. కోటా జిల్లాలోని రామ్‌గంజ్ మండి ప్రాంతంలోని భావ్‌పురా నివాసి పంకజ్‌కు రావత్‌భటా నివాసి మధు రాఠోడ్‌తో శనివారం పెళ్లి జరగాల్సి ఉంది. కొన్ని రోజుల నుంచి ఇరువురి ఇళ్లలో వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వధువు వివాహ వేదికకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మెట్లపై నుంచి జారిపడింది. ఆ ఘటనలో ఆమె రెండు చేతులు విరిగాయి. తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. వధువు జారిపడిన విషయం చెప్పేలోపే వరుడి కుటుంబం పెళ్లి మండపానికి బయలుదేరింది. దీంతో పంకజ్ తండ్రి శివలాల్, మధు తండ్రి రమేశ్ రాఠోడ్ ఇద్దరూ ఈ విషయం గురించి మాట్లాడుకున్నారు. ఆస్పత్రిలోనే వివాహ వేడుక నిర్వహించాలని నిర్ణయించారు. పెళ్లి కోసం ఆస్పత్రిలోనే గదిని బుక్ చేశారు. దాన్ని అందంగా అలంకరించారు. వివాహ తంతు అంతా అక్కడే నిర్వహించారు. వధూవరులు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.