Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేరళ
కేరళ పోలీసులు మందుబాబులకు వింత శిక్ష విధించారు. పాఠశాల విద్యార్థుల తరహాలో మందుబాబులతో ఇంపోజిషన్ రాయించారు. ఇకపై తాగి డ్రైవింగ్ చేయను అని మందుబాబులతో 1000 సార్లు రాయించారు. అయితే ఆదివారం కొచ్చిలో ఓ ప్రయివేటు బస్సు.. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో హైకోర్టు జోక్యం చేసుకుని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేరళ పోలీసులు సోమవారం ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పట్టుబడిన మందుబాబులకు త్రిపునితుర పోలీసులు వింత శిక్ష విధించారు.
వారందరినీ స్టేషన్కు తీసుకొచ్చి ఇకపై తాగి డ్రైవింగ్ చేయను అని మందుబాబులతో 1000 సార్లు రాయించారు. అయినప్పటికీ వారికి అసలు శిక్ష తప్పదని పోలీసులు పేర్కొన్నారు. మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేసి, వారి లైసెన్సులను సస్పెండ్ చేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.