Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - టర్కీ
తుర్కియే-సిరియా దేశాల్లో మరణమృదంగం కొనసాగుతోంది. గత సోమవారం సంభవించిన భారీ భూకంప ధాటికి ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 37వేల మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఒక్క తుర్కియేలోనే 37,000 మంది మరణించగా.. సిరియాలో 5,714 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
భారీ భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేక మంది ప్రజలు చిక్కుకుని సాయం కోసం వేచి చూస్తున్నారు. గడ్డకట్టే చలిలోనూ సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వేల మంది ప్రజల్ని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే, భూకంపం సంభవించి వారం రోజులు పూర్తవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడతారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు స్నిఫర్ డాగ్స్, థర్మల్ కెమెరాలను వినియోగిస్తున్నారు.