Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ముంబై నుంచి హైదరాబాద్కు గాంజా, మరిజునా, ఎండిఎంఎ వంటి మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్ పెడ్లర్స్ నుంచి 204 గ్రాముల మెథలెనీడయాక్సీమెథాంఫెటమైన్(ఎండిఎంఎ), 110 గ్రాముల మరిజునా, కొన్ని సెల్ ఫోన్లను, నగదు, కార్లను పట్టుకున్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ డ్రగ్ వాడకందారుని ట్రాక్ చేసి రాష్ట్రంలోకి మాదకద్రవ్యాలు ఎలా సరఫరా అవుతున్నాయో పోలీసులు కనుగొన్నారు. పోలీసులు తమ పరిశోధనలో కొండాపూర్ నివాసి సనా ఖాన్ను గుర్తించారు. ఆమె ఓ ఐటి ఉద్యోగి. ఆమె మాదకద్రవ్యాలను సేవిస్తుండడమేకాక, హైదరాబాద్లో వాటిని విక్రయిస్తోందని కూడా గుర్తించారు. ఆమెపై నిఘా పెట్టి పోలీసులు నెట్వర్క్ గుట్టు రాబట్టారు. ఈ వివరాలను సిటీ పోలీస్ కమిషనర్ సివి. ఆనంద్ తెలిపారు.
'గత రెండు మూడేళ్లుగా ఆమె తరచూ ముంబైకి వెళ్లివస్తోంది. ముంబైలో జథిన్ బాలచంద్ర బాలేరావు నుంచి డ్రగ్స్ కొంటోంది. ఆమె ఒక గ్రాము ఎండిఎంఎను మూడు వేల రూపాయలకు కొంటుంది. తర్వాత దానిని హైదరాబాద్లో ఏడు వేల రూపాయాలకు అమ్ముతుంటుంది' అని ఆనంద్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. పోలీసులు తమ దర్యాప్తులో సనా ఖాన్కు హైదరాబాద్లో నలభైయాభై మంది, ముంబైలో 70 మంది వినియోగదారులున్నట్లు గుర్తించారు. పోలీస్ కమిషనర్ ఆనంద్ కథనం ప్రకారం జథిన్ నైజీరియాకు చెందిన ఎమాన్యూల్ ఓసోండు నుంచి కొకైన్ ను సేకరించేవాడు. ఎమ్మాన్యూల్ను ఇదివరలో బాహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు.