Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని బీబీనగర్-ఘట్కేసర్ మధ్య పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ చేరుకున్నది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ ఘట్కేసర్ మండలంలోని అంకుషాపూర్ వద్ద పట్టాలు తప్పింది. రైలులోని ఎస్ 1, ఎస్ 2, ఎస్3, ఎస్4 బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి హానీ జరుగలేదు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టాలు తప్పిన బోగీలను రైలు నుంచి వేరుచేశారు. మిగిలిన 15 బోగీలతో రైలు సికింద్రాబాద్ చేరుకున్నది. సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. బోగీలను పట్టాలపైకి ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, రైలు పట్టాలు తప్పడటంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖపట్నం-మహబూబ్‌నగర్ ప్రత్యేక రైలును బీబీనగర్ స్టేషన్లో నిలిపివేశారు. తిరుపతి-పూర్ణా (నాందేడ్) స్పెషల్ ట్రైన్‌ను భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్లో, దిబ్రూగఢ్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలును భూవనగిరిలో నిలిపివేశారు.