Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢీల్లి
వాతావరణ సంక్షోభం కొన్ని దేశాలకు మరణశిక్షగా పరిణమిస్తోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఐరాస భద్రతా మండలిలో జరిగిన చర్చ తరుణంలో ఆంటోనియో గుటెరస్ కీలక ప్రసంగం చేస్తూ వాతావరణ సంక్షోభ పరిస్థితులతో సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. లండన్ నుంచి లాస్ ఏంజిల్స్ వరకు, బ్యాంకాక్ నుంచి బ్యూనస్ ఎయిర్స్ వరకు ఈ పరిణామాలు దాదాపు వంద కోట్ల మందికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నయన్నారు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతుండటం సామూహిక వలసలకు దారితీసే ప్రమాదముందన్నారు.
ఇప్పటికే కొన్ని దేశాల తీరప్రాంతాల్లో సముద్రమట్టాల పెరుగుదల సగటు రేటు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఇదిలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు శాశ్వతంగా కనుమరుగయ్యే అవకాశముంది అని హెచ్చరించారు. ‘‘ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగితే.. సముద్ర మట్టాల పెరుగుదల రెట్టింపు ఉండే అవకాశముంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే బంగ్లాదేశ్, చైనా, భారత్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ప్రమాదంలో పడినట్లే. ప్రతి ఖండంలోని ప్రధాన నగరాలు తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుంది అని గుటెరస్ అన్నారు. ఈ పరిస్థితులకు మూలకారణమైన పర్యావరణ సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని లేదంటే ముప్పు పొంచి ఉన్న దేశాలకు అది మరణ శిక్షలా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.