Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కూకట్పల్లిలో ఈ నెల 12న అర్ధరాత్రి పార్క్ చేసిన మూడు బస్సుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. డ్యూటీకి రానన్న డ్రైవర్ను యజమాని చితకబాదినందుకు ప్రతీకారంగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. పోలీసుల వివరాల ప్రకారం కూకట్పల్లి రంగధాముని చెరువు కట్ట దిగువన భారతీ ట్రావెల్స్ గ్యారేజీలో నిలిపి ఉంచిన 3 బస్సులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అకస్మాత్తుగా కాలి బూడిదయ్యాయి. ఈ గ్యారేజీలో నిత్యం 11 బస్సులు పార్క్ చేసి ఉంటాయి.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురానికి చెందిన పసుపులేటి వీరబాబు (34) రెండు నెలలుగా బస్సుల యజమాని కృష్ణారెడ్డి వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ తరుణంలో ఆదివారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లాల్సిందిగా కృష్ణారెడ్డి ఆదేశించారు. దీంతో తాను ఊరికి వెళ్తున్నానని, డ్యూటీకి రానని వీరబాబు చెప్పాడు. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణారెడ్డి తన సోదరుడి కుమారుడైన యశ్వంత్రెడ్డితో కలిసి వీరబాబును ఓ గదిలో బంధించి బెల్టు, కొబ్బరిమట్టతో దాడిచేశాడు. వారిపై పగ పెంచుకున్న వీరబాబు అర్ధరాత్రి దాటిన తర్వాత గ్యారేజీకి వెళ్లి ఓ బస్సుపై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. ఆ మంటలకు పక్కనే ఉన్న రెండు మినీ బస్సులు కూడా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరబాబును అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం తెలిసింది. నిందితుడు వీరబాబు ఫిర్యాదుతో బస్సుల యజమాని కృష్ణారెడ్డి, యశ్వంత్రెడ్డిపైనా కేసు నమోదైంది.