Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై దాడి జరిగింది. షాతో పాటు అతని స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్‌పై ముంబైలోని శాంటా క్రూజ్ ఫైవ్ స్టార్ హోటల్ ఆవరణలో పలువురు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో షా ప్రయాణిస్తున్న కారును దుండగులు బేస్‌బాల్ బ్యాట్లతో ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై షా స్నేహితుడు సురేంద్ర యాదవ్ సమీప ఓషివరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. 8 మందిపై పలు సెక్షన్ల (143, 148,149, 384, 437, 504, 506) కింద కేసులు నమోదు చేశారు. షా స్నేహితుడు సురేంద్ర యాదవ్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
ఫిబ్రవరి 15న పృథ్వీ షా.. సురేంద్ర యాదవ్‌తో పాటు పలువురు స్నేహితులతో కలిసి ముంబైలోని శాంటా క్రూజ్ హోటల్లో డిన్నర్ చేసేందుకు వెళ్లాడు. షా హోటల్ అవరణలోకి ప్రవేశించగానే నిందితుల్లో ఇద్దరు వచ్చి సెల్ఫీలు ఆడగ్గా షా వారితో కలిసి ఫోటోలు దిగి హోటల్‌లోనికి ప్రవేశించేందుకు ముందుకు కదిలాడు. ఈలోపు మరో ఇద్దరు వచ్చి సెల్ఫీ దిగాలని షాపై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు షా ఒప్పుకోకపోవడంతో వారు అతన్ని దిగ్బంధించే ప్రయత్నం చేశారు. ఈలోపు పక్కనే ఉన్న షా స్నేహితుడు హోటల్ యాజమాన్యానికి ఫోన్ చేసి జరుగుతున్న విషయాన్ని వివరించగా.. మేనేజ్మెంట్ నిందితులను హోటల్ బయటకు గెంటేసింది. దీంతో కోపోద్రేక్తులైన నిందితులు హోటల్ బయట కాపు కాచి షా ప్రయాణిస్తున బీఎండబ్ల్యూ కారుపై బేస్‌బాల్ బ్యాట్లతో దాడికి దిగారు. వెంటనే అలర్ట్ అయిన షా స్నేహితుడు.. అతన్ని మరో కారులోకి తరలించాడు. అయినప్పటికీ వదలని నిందితులు షా ప్రయాణిస్తున్న కారును ఛేజ్ చేసి లోటస్ పెట్రోల్ బంకు వద్ద మరోసారి అటకాయించారు. షా కారు వద్దకు ఓ యువతిని పంపిన నిందితులు 50000 నగదు ఇస్తే విషయాన్ని ఇక్కడితో వదిలేస్తామని.. లేకపోతే కేసులు పెడతామని బెదిరించారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న షా నేరుగా ఓషివరా పీఎస్‌కు చేరుకున్నాడు. జరిగిన విషయంపై మాట్లాడేందుకు ఇష్టపడని షా స్నేహితుడితో పాటు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విషయం క్షణాల్లో దావణంలా వ్యాపించింది. ప్రస్తుతం షాపై దాడి జరిగిన విషయం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.