Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కలశ యాత్ర కోసం తీసుకొచ్చిన ఓ ఏనుగు రెచ్చిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్యను ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. మృతులు ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ చిలువాటల్ ప్రాంతంలోని జగత్‌బేలాలో ఉన్న మహ్మద్‌పూర్ మాఫీ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహ్మద్‌పూర్ మాఫీ గ్రామంలో కలశ యాత్ర ప్రారంభానికి ముందు పండల్లో యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఆ ప్రాంతం అంతా చాలా సందడి ఉన్నది. ఈ సమయంలో కలశ యాత్ర కోసం తీసుకొచ్చిన ఏనుగును కొందరు వ్యక్తులు ఆటపట్టించడం ప్రారంభించారు. వారి ఆకతాయితనానికి ఏనుగు ఆగ్రహానికి గురై అటు ఇటు పరుగెత్తడం మొదలుపెట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును అదుపు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నించారు. ఏనుగు తొక్కడంతో ఇద్దరు మహిళలు కాంతిదేవి (55), కౌసల్యాదేవి (50) తోపాటు బాలుడు బాలకృష్ణ (4) మృతిచెందారు. మహిళలిద్దరూ మహ్మద్‌పూర్ మాఫీ ప్రాంతం నివాసితులే. చనిపోయిన పిల్లవాడు అనారోగ్యంతో ఉన్నాడు. తన కుమారుడిని యజ్ఞంలోకి తీసుకొచ్చి పూజిస్తే వ్యాధి నయమవుతుందని నమ్మిన తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. ఇంతలో ఆకతాయిల వేధింపులకు ఆగ్రహించిన ఏనుగు కట్లు తెంపుకుని రెచ్చిపోయింది. ఇద్దరు మహిళలతోపాటు ఆ చిన్నారిని కూడా విసిరి చంపేసింది. దాంతో మాఫీ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకున్నది.