Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. కడపటి వార్తలు అందే సరికి 81.10 శాతం ఓటింగ్ నమోదైంది. కౌంటింగ్ వచ్చే నెల 2 న చేపట్టనున్నారు. సీఎం డాక్టర్ మాణిక్ సాహా బోర్దావాలిలోని మహారాణి తులసీబటి పాఠశాలలో ఓటు వేయగా.. కేంద్ర సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ ధన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. సీపీఐ(ఎం) అధినేత, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అగర్తలాలో ఓటు వేశారు. ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్, సీపీఐ-ఎం చేతులు కలిపాయి. బీజేపీ తన అలయెన్స్‌గా ఉన్న ఇండిజినస్ పీపుల్స్ ఫంట్ అఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) తో కలిసి ఎన్నికల్లో సీట్లను షేర్ చేసుకున్నది. ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ ఎం తోపాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రాంతీయ పార్టీ టిప్రా (టీఐపీఆర్ఏ) మోతా అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. త్రిపుర అసెంబ్లీకి మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ 55 స్థానాల్లో, దాని మిత్రపక్షం 6 స్థానాల్లో పోటీ చేసింది. సీపీఐ ఎం, ఫార్వర్డ్ బ్లాక్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్పీ)లతో కూడిన వామపక్ష ఫ్రంట్ 47 స్థానాల్లో పోటీ చేయగా, కాంగ్రెస్ 13 స్థానాల్లో తన అభ్యర్థులను పోటీలో నిలిపింది. రాజ వంశీయుడైన ప్రద్యోత్ కిషోర్ డెబ్వర్మ నేతృత్వంలోని కొత్తగా ఏర్పాటైన ప్రాంతీయ పార్టీ టిప్రా మోతా పార్టీ 42 స్థానాల్లో పోటీ చేసింది.