Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఒక నిరుపేద యువతికి పైసా ఖర్చులేకుండా క్లిష్టమైన శస్త్రచికిత్స జరిపారు గాంధీ వైద్యులు. ఈ శస్త్రచికిత్స ద్వారా రోగి నుంచి విజయవంతంగా 7.5కిలోల ఒవేరియన్ కణతిని తొలగించారు. ఈ మేరకు కేసు వివరాలను గాంధీ దవాఖాన గైనకాలజి విభాగాధిపతి డాక్టర్ ఎస్.సంగీత వెల్లడించారు. ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ళ యువతి స్థానికంగా ఉన్న దుకాణంలో దినసరి కూలీగా పనిచేస్తుంది. గత కొన్ని రోజులుగా సదరు యువతి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. దీంతో పాటు కడుపు ఉబ్బడంతో మూడు రోజుల క్రితం గాంధీ వైద్యులను ఆశ్రయించింది. ఈ మేరకు వైద్యపరీక్షలు జరిపిన డాక్టర్లు రోగి కడుపులో ఒవేరియన్ కణితి ఉన్నట్లు నిర్ధారించారు. ఒవేరియన్కు ఉన్న కణితి తొలగించడం కొంత క్లిష్టమైనప్పటికీ గురువారం ఉదయం గాంధీ గైనకాలజి విభాగానికి చెందిన వైద్యబృందం రోగికి శస్త్రచికిత్స జరిపారు. ఈ శస్త్రచికిత్సలో రోగి కడుపులో నుంచి 7.5కిలోల భారీ ఒవేరియన్ కణితిని విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం పూర్తి నిలకడగానే ఉందని గైనకాలజి విభాగాధిపతి డాక్టర్ సంగీత తెలిపారు. ఈ శస్త్రచికిత్స ప్రైవేటులో అయితే కనీసం రూ.1.5లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. అయితే ప్రైవేటులో వైద్య ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత లేక గాంధీని ఆశ్రయించినట్లు యువతి కుటుంబ సభ్యులు తెలిపారు.