Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: తమపట్ల విశ్వాసం చూపే ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్‌లు, న్యాయ కోవిదులు, విశ్రాంత అధికారులతో రాజ్ భవన్లను నింపేస్తూ కేంద్రం ఆ వ్యవస్థను భ్రస్టు పట్టిస్తోందని సీపీఐ(ఎం) ఆరోపించింది. ఆ పార్టీ పత్రిక పీపుల్స్ డెమోక్రసీ(పీడీ) సంపాదకీయంలో గురువారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. రెండు నెలల కిందట సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమించడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా విమర్శించింది. తాజాగా ఆరుగురు గవర్నర్ల నియామకాన్ని పరిశీలిస్తే మోడీ సర్కార్ ఆ వ్యవస్థను ఎంతగా దుర్వినియోగం చేస్తోందో తెలుస్తోందని వివరించింది. 2019లో అయోధ్యపై ఏకగ్రీవంగా తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ సభ్యులుగా ఉన్న విషయాన్ని పీడీ సంపాదకీయంలో గుర్తు చేసింది. వీటన్నింటిని గమనిస్తే ఈ నియమాకం క్విడ్‌ప్రోకోను తలపిస్తోందని సంపాదకీయంలో ఆరోపించింది. కేరళ గవర్నర్‌గా సుప్రీం విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నియామకం నుంచే ఈ విషయంలో కేంద్రం వైఖరి అనుమానాస్పదంగా ఉందని విమర్శించింది. ఇలాంటి చర్యల వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రత ప్రమాదంలో పడుతుందని పేర్కొంది. తాజాగా నియమించిన నలుగురికి ఆర్ఎస్ఎస్-బీజేపీకి విశ్వాసపాత్రంగా ఉండటమే అర్హత అని వ్యాఖ్యానించింది. అధికార పార్టీకి నమ్మకస్థులైన వారు గవర్నర్లుగా తమ విధులెలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో నియమించిన గవర్నర్లు కొన్నాళ్లుగా కేంద్రం ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న విషయాన్ని స్పష్టం చేసింది. ఈ రాష్ట్రాలన్నీ ఏకమై ఇలాంటి రాజ్యాంగేతర చర్యలపై కేంద్రంతో పోరాడాలని పిలుపునిచ్చింది. ప్రజలను చైతన్యపరిచి సమాఖ్య సూత్రాలను కాపాడాలని సూచించింది.