Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు మరోమారు సత్తా చాటారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పర్యాటక జట్టును 263 పరుగులకు ఆలౌట్ చేశారు. మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు పోటీపడి వికెట్లు తీయడంతో ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్ చేరక తప్పలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కమిన్స్ సేనకు 50 పరుగుల వద్ద తొలి దెబ్బ తగిలింది. 15 పరుగులు చేసిన ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను షమీ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత 91 పరుగుల వద్ద మార్నస్ లబుషేన్(18), స్టీవ్ స్మిత్(0) వికెట్లను కోల్పోయింది. వీరిద్దరినీ అశ్విన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత కాసేపటికే ట్రావిస్ హెడ్ (12) షమీ చేతికి చిక్కాడు.
108 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఉస్మాన్ ఖావాజా, పీటర్ హ్యాండ్స్కోంబ్ ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి భారత బౌలర్లను ఎదురొడ్డుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 81 పరుగులు చేసి సెంచరీకి చేరువవుతున్న ఖావాజాను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. అనంతరం మరోమారు ఆసీస్ వికెట్లు పేకమేడలా కుప్పకూలాయి. హ్యాండ్స్కోంబ్ చివరి వరకు నిలిచి 72 పరుగులు చేశాడు. కెప్టెన్ కమిన్స్ 33 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీకి 4 వికెట్లు దక్కగా, అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.