Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ నివేదిక వివాదాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసే కమిటీలో కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్లో సూచించే నిపుణుల పేర్లను చేర్చేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. తామే స్వయంగా నిపుణులను ఎంపిక చేస్తామని, యావత్తు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని ధర్మాసనం తెలిపింది. నిపుణుల పేర్లను తాము ప్రభుత్వం నుంచి స్వీకరిస్తే, అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. కమిటీ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలని పేర్కొంది. హిండెన్‌బర్గ్-అదానీ వివాదంపై దర్యాప్తు జరిపేందుకు సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిని నియమించబోమని స్పష్టం చేసింది. అయితే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని వివరించింది.