Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మేయర్ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటువేసే హక్కు లేదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. దాంతో.. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజారిటీతో గెలిచినా.. లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డంపెట్టుకుని మేయర్ పీఠాన్ని మాత్రం తామే దక్కించుకోవాలన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలకు తెరపడింది.
రెండు నెలల క్రితం జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. మొత్తం 250 వార్డులకుగాను ఆమ్ఆద్మీ పార్టీ 134 వార్డులను గెలుచుకుంది. అప్పటిదాకా ఎంసీడీ పీఠంపై ఉన్న బీజేపీ కేవలం 104 స్థానాలకు పరిమితమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ 9 వార్డుల్లో విజయం సాధించింది. దాంతో న్యాయంగా అయితే ఢిల్లీ మేయర్ పీఠం ఆమ్ ఆద్మీ పార్టీకే దక్కాలి. కానీ, ఇక్కడే బీజేపీ కుట్రలకు తెరలేపింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేత 10 మందిని ఎంసీడీకి నామినేట్ చేయించి, వారి చేత మేయర్ ఎన్నికల్లో ఓటు వేయించే ప్రయత్నం చేసింది. ఈ కుట్రపై ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా ఫైట్ చేసింది. దాంతో మేయర్ ఎన్నిక కోసం ఎంసీడీ కొలువుదీరిన ప్రతిసారి గందరగోళం చోటుచేసుకుంది. ఈ గందరగోళం కారణంగా మేయర్, డిప్యూటీ మేయర్, ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోకుండానే మూడుసార్లు వాయిదాలు పడ్డాయి. చివరికి ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో సుప్రీంకోర్టు ఇప్పుడు ఆప్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నామినేటెడ్ సభ్యులకు ఎంసీడీ ఎన్నికల్లో ఓటువేసే హక్కు లేదంటూ బీజేపీకి ఝలక్ ఇచ్చింది.