Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కామారెడ్డి
తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. తల్లి పాల ప్రాముఖ్యతను వివరించడం, వాటిని పాటించడంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రికి ప్రతిష్టాత్మకమైన బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రిడేషన్- గ్రేడ్-1 వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ల ఆధ్వర్యంలోని ‘బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఇండియా’ మిషన్ లో భాగంగా బిడ్డకు తల్లి పాల ప్రాముఖ్యతను వివరించడంతో పాటుగా పుట్టిన బిడ్డకు తొలి అరగంటలోనే ముర్రుపాలు తాగించాలి.
దీంతో పాటుగా బిడ్డకు ఆరునెలల పాటు తల్లి పాలు తాపించే విధంగా తల్లులకు వివరించి అమలు చేసే హాస్పిటల్ లకు ఈ అక్రిడేషన్ ఇస్తారు. డబ్బా పాల దుష్ప్రభావాల గురించి వివరించి వాటిని పసి బిడ్డలకు దూరంగా ఉంచడం కూడా ఈ మిషన్ ఉద్దేశం. బాన్సువాడలోని ఆస్పత్రిలో తల్లి పాల ప్రాముఖ్యతపై డాక్టర్లు, డ్యూటీ నర్సులు, ఏఎన్ఎంలు, ఆయాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఇక్కడ ఈ మిషన్ వంద శాతం అమలవుతుంది.
కొద్ది రోజుల క్రితం నేషనల్ హేల్త్ మీషన్ (ఎన్హెచ్ఎం) రాష్ట్ర అధికారులు బాన్సువాడ మదర్ అండ్ చైల్ట్ హాస్పిటల్(ఎంసీహెచ్)ను పరిశీలించారు. ఈ ఆసుపత్రిలోని సిబ్బంది తల్లి బిడ్డకు పాలు పట్టే విధానం, తల్లి పాల ప్రాముఖ్యతపై గర్భిణులకు, బాలింతలకు వివరించడంతో పాటుగా అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. అనంతరం ఢిల్లీ నుంచి వచ్చిన డబ్ల్యూహెచ్వో ప్రత్యేక బృందం బాన్సువాడ ఆస్పత్రిలో తనిఖీలు చేసి విచారణ చేపట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రతిష్టాత్మకమైన ‘ బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రిడేషన్- గ్రేడ్-1 ’ సర్టిఫికెట్ అందజేశారు.