Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి. భక్తులు శుక్రవారం నుంచే ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగనుండటంతో ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాలను రంగు రంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం, ఏడుపాయల వనదుర్గాభవానిమాత ఆలయం, మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట, శ్రీశైలం, జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ ఆలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి, కోటగుళ్లు, ములుగు జిల్లాలోని రామప్ప, మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామి, హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి, జనగామ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వరస్వామి, వరంగల్లోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి, కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం విద్యుత్తు కాంతుల్లో వెలిగిపోతున్నాయి. నల్లగొండ జిల్లా మేళ్లచెర్వులోని స్వయంభూ శంభులింగేశ్వరాలయం, నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులోని పార్వతీ జడల రామలింగేశ్వరాలయం, దామచర్ల మండలంలోని వాడపల్లి శైవాలయం, నల్లగొండలోని పానగల్లు చాయా సోమేశ్వరాలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాయి. కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం శివరాత్రికి ఒకరోజు ముందు నుంచే శివనామస్మరణతో మార్మోగుతున్నది. శివాలయాల్లో భక్తుల రద్దీ కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, చోరీలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.