Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బల్గేరియాలో విషాదం చోటు చేసుకున్నది. బల్గేరియాలో ఓ ట్రక్కులో 18 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 22 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని దవాఖానలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నది. వీరంతా బల్గేరియాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ట్రక్కు దొరికిన ప్రదేశం బల్గేరియా రాజధాని సోఫియాకు సమీపంలోనే ఉండటం విశేషం. 2019 లో ఇలాగే బ్రిటన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 39 మంది దుర్మరణం పాలయ్యారు.
లోకోర్స్ కో వద్ద నిలిపి ఉంచిన ఓ ట్రక్కు నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానిక గ్రామస్థులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా.. ట్రక్కు చుట్టుపక్కల అనేక మృతదేహాలు కనిపించాయి. ఓ దేశం నుంచి 52 మందితో ట్రక్కు బల్గేరియాకు బయల్దేరింది. చాలా రోజులుగా ఆహారంకానీ, తాగునీరుకానీ లేకపోవడంతో పాటు ట్రక్కులో కిక్కిరిసిపోయి ఉండి ఊపిరాడక 18 మంది వలసదారులు చనిపోయారు. మరో 22 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరికి చికిత్స అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్రక్కు ఎక్కడి నుంచి వస్తున్నది అధికారులు తెలుసుకునే పనిలో పడ్డారు.
ట్రక్కులో 52 మంది వలసదారులు ఉన్నట్లు బల్గేరియా అధికారుల విచారణలో తేలింది. వీరిని ఎక్కడి నుంచి ఎవరు బల్గేరియాకు తీసుకొస్తున్నారు అనేది తెలియరాలేదు. ట్రక్కులో చిన్న చిన్న కంపార్ట్మెంట్లు చేసి, జనాలను అందులో తోశారు. చాలా మంది ఊపిరాడక, ఆకలితో చనిపోయారని
బల్గేరియా ఆరోగ్య మంత్రి తెలిపారు. వీరంతా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినవారుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ట్రక్కు టర్కీ మీదుగా ప్రయాణించి బల్గేరియా చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డిప్యూటీ ప్రాసిక్యూటర్ జనరల్ బోరిస్లోవ్ తెలిపారు.